ప్లాస్టిక్‌పై ప్రభుత్వ సమరం.. బాటిళ్లకు నజరానా..   - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్టిక్‌పై ప్రభుత్వ సమరం.. బాటిళ్లకు నజరానా..  

August 23, 2019

Ecuador city.

కూరగాయలకు, కిరాణ సామాన్లకు, పాల ప్యాకెట్లకు, వాటర్ ప్యాకెట్లకు ఇలా ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్ కవర్లు లేకుండా కొనలేకపోతున్నాం. అది పర్యావరణానికి చేసే ముప్పు గురించి తెలిసి కూడా దానిని అదేపనిగా గుడ్డిగా వాడుతున్నాం. భవిష్యత్తు తరాలకు మనం ఎంతటి కాలుష్యాన్ని అందిస్తున్నామో మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా? అంటే వుంది. అది మనచేతుల్లోనే వుంది అని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రకృతి ప్రేమికులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నారు. అయినా పట్టించుకుంటున్నవారు చాలా తక్కువ అనే చెప్పాలి. కొందరు కొన్ని రోజులు ప్లాస్టిక్ వాడొద్దు అనుకుంటారు కానీ, వాడకుండా వుండలేకపోతున్నారు. మరి ఈ దురలవాటు నుంచి బయటపడాలంటే వేరే మార్గమే లేదా? అంటే వుంది అంటోంది ఈక్వెడార్ ప్రభుత్వం. 

‘మంచి చెప్పినా.. దానికి కొంత నజరానా జోడిస్తే దానిని తప్పకుండా పాటిస్తారు’ అనే ఫార్ములాను వాడారు. అనేక దేశాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఈక్వెడార్ ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు తెరలేపింది. ఈక్వెడార్‌లోని గయాకిల్ నగరంలో దాదాపుగా 2.7 మిలియన్ల జనాభాను కలిగి ఉంటుంది. దేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం గయాకిల్. దేశవ్యాప్తంగా గయాకిల్ నగరంలోనే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆ నగరం చెత్తమయం అయిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం నగరాన్ని పరిశుభ్రంగా వుంచాలనుకుంది. ప్రజలకు వట్టిగా చెప్పడం కాకుండా వారికి లాభం చేకూరేలా చెప్పాలని భావించింది. అంతే కార్యాచరణ ప్రారంభించింది.  

వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఇస్తే డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. వాడి పడేసిన ఒక్క ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే 2 సెంట్లు.. 15 బాటిల్స్‌కు 30 సెంట్లు ఇస్తామని ప్రకటించింది. ఆ డబ్బులతో మెట్రో టిక్కెట్ కొనుగోలు చేసి వెళ్లవచ్చని గయాకిల్‌లో ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్లాస్టిక్ బాటిళ్లను మునుపటిలా ఎక్కడపడితే అక్కడ పారేయకుండా తెచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అలా వచ్చిన బాటిల్స్‌ను రీసైక్లింగ్ చేస్తున్నారు.చాలా మంది వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను కలెక్ట్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ మెషిన్‌ల వద్ద బారులు తీరి మరీ వాటిల్లో ఆ బాటిల్స్‌ను డిపాజిట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. 

దీంతో ప్రభుత్వ అధికారులు తమ పాచిక పనిచేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందిన వచ్చిందనీ..ఇప్పటికే టన్నులకొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను తొలగించామని తెలిపారు. దీంతో నగరంలో ప్లాస్టిక్ బెడద కొంతమేర తగ్గిందని అంటున్నారు.