ED arrests Aurobindo Pharma director in Delhi liquor scam
mictv telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: అరబిందో ఫార్మా ఎండీ, మరో కీలక వ్యక్తి అరెస్టు

November 10, 2022

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఏపీకి చెందిన శరత్‌ చంద్రారెడ్డి, తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారి వినయ్ బాబులను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శరత్‌, వినయ్‌బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ తెలిపింది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్‌గా ఉండగా.. వినయ్‌బాబు మద్యం వ్యాపారం చేస్తున్నారు.

సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.