కోట్ల ఆస్తిని కొట్టేయడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. బ్రిటిష్ వ్యక్తికి దత్తపుత్రుడినని చెప్పి తప్పుడు పత్రాలు చూపించి అనుకున్నది సాధించాడు. బండారం బయటపడి శిక్ష అనుభవిస్తున్నాడు.ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్ జాతీయుడైన ఎడ్విన్ జూబర్ట్ వాన్ ఇంగెన్ అనే వ్యక్తి మైసూరు రాజుల దగ్గర టాక్సి డెర్మిస్ట్ (చచ్చని జంతువుల చర్మాలను వాడి అవి బతికున్నట్లు చూపే కళ)గా పనిచేశాడు. అతని పనితనాన్ని మెచ్చి రాజులు విలువైన బహుమతులు ఇచ్చారు. వాంగెన్ భారత్లోనే అవివాహితుడిగా తన 101వ ఏట 2013లో మృతిచెందాడు.
ఎడ్విన్కు రాజుల నుంచి దక్కిన విలువైన బహుమతులపై మైకేల్ ఫ్లైడ్ ఈశ్వర్ అనే వ్యక్తి కన్నుపడింది. ఈశ్వర్ మైసూరులోని గుర్రాల సవారీ శిక్షకుడు. ఎడ్విన్ చివరదశలో ఉండగా ఇదే మంచి అవకాశంగా భావించి పాచిక వేశాడు. తాను ఎడ్విన్కు దత్తపుత్రుడినంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు. అందరినీ నమ్మించాడు. తెలివిగా ఎడ్విన్ చనిపోకముందే తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించి ఎడ్విన్ పేరు మీదున్న ఆస్తినంతటినీ తన పేరు మీద బదలాయించుకున్నాడు. దీనిని పసిగట్టిన ఎడ్విన్ 2013లో చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎడ్విన్ చనిపోయాడు. దీంతో ఈ కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీకి బదలాయించారు. అప్పటినుంచి ఆ విభాగం దర్యాప్తు చేస్తోంది.
తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ విభాగం బుధవారం ఈశ్వర్ నివాసంలో తనిఖీలు నిర్వహిచింది. అతని ఇందదట్లో విలువైన వివిధ రకాల జంతువుల చర్మాలు, అస్థిపంజరాలు, కొమ్ములు వంటివి సుమారు 70 దాకా బయటపడ్డాయి. అంతేకాక, మైసూరులో నగరంలో ఒక ఇల్లు, కేరళలోని వయనాడ్లో ఓ కాఫీ తోట ఉన్నట్టు పత్రాలు దొరికాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.117 కోట్ల పైచిలుకు విలువ ఉంటుందని ఈడీ తెలిపింది. అతడిని అదుపులోకి తీసుకున్న ఈడీ ఇంకా లోతుగా విచారణ చేస్తోంది.