ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీని అని తొలుత చెప్పి, తర్వాత మాట మార్చిన హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైని కూడా ఈడీ సీన్‌లోకి తీసుకొచ్చింది. కవితను, అతణ్ని పక్క పక్కనే కూర్చోబెట్టి విచారిస్తున్నారు. స్కామ్‌లో వందకోట్ల ముడుపులు, ఫోన్ల విధ్వంసం వంటి కీలకమైన విషయాలను ఇద్దరి నుంచి ఆరా తీసి సరిపోల్చుకుంటూ నోట్ చేసుకుంటున్నారు. పిళ్లై ఎందుకు మాట మర్చాడో లోతుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. కవిత, పిళ్లైల మధ్య జరిగినట్లు భావిస్తున్న సంభాషణలు, చాటింగ్ వివరాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడుగంటలుగా సాగుతున్న విచారణంలో కవిత కొన్ని ప్రశ్నలకు జవాబులివ్వడానికి చాలా సమయం తీసుకున్నారని, అందుకే విచారణ జాప్యం జరుగుతోందని ఈడీ వర్గాలు చెప్పాయి. ఈడీ కార్యాలయం చుట్టూ మీడియాతోపాటు ఎవరికీ ప్రవేశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా, ఈ కేసులో వాస్తవాలను పక్కగా రాబట్టడానికి కీలక నిందితులను ఒకేచోట కలిపి కూర్చోబెట్టి విచారించడానికి ఈడీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలా విచారిస్తే నిజానిజాలు పూర్తిగా బయటపడతాయని, విచారణను వీడియో తీసి గట్ట సాక్ష్యంగా వాడుకోవచ్చన్నది దర్యాప్తు సంస్థ ఆలోచన అని చెబుతున్నారు. చాటింగ్ సంభాషల్లో దొర్లిని ‘మేడమ్ 33%’’ అంటే కవితేనని ఈడీ భావిస్తోంది. ఆమెతో కలిపి విచారణకు హాజరు కానున్నవారిలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కులదీప్ సింగ్, నరేంద్ర సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.