ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నుంచి ఈడీ అధికారులు పలు అంశాలను రాబడుతున్నారు. ఐదుగురు అధికారుల బృందం ఆమెను విచారిస్తోంది. ‘డీల్’కు సంబంధించిన డేటా ఉన్న లగ్జరీ ఫోన్లను ఆమె ధ్వంసం చేశారన్న కోణంలో సీరియస్‌గా విచారణ జరుపుతున్నారు. ఆ ఫోన్ నంబర్ల నుంచి రికవరీ చేసిన డేటాను కవిత ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే వంద కోట్ల హవాలా డబ్బును ఏవిధంగా చేతులు మారిందో సేకరించిన వివరాలపై ఆమెను ప్రశ్నిస్తున్నారు. కవిత, శరత్ చంద్రారెడ్డి (అరబిందో ఫార్మా), వైకాపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు రాఘవరెడ్డి నిర్వహణలోని సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ఎలా వెళ్లాయో చెప్పాలని ఆమెను ప్రశ్నిస్తున్నారు.
కవిత సహా 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశాని ఈడీ చెబుతున్న సంగతి తెలిసిందే. కవిత రెండు నెంబర్లతో ఏకంగా పది మెుబైల్ ఫోన్లు వాడి, ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారన్నది ఈడీ ఆరోపణలు. విచారణ క్లిష్టమైంది కావడం, కవిత సమాధానాలివ్వడానికి చాలా సమయం తీసుకుంటున్నారని, విచారణ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశముందని సమాచారం. కవిత చెప్పే సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే సాయంత్రం ఆమెను ఇంటికి పంపుతారనే, లేకపోతే అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈమేరకు సంకేతాలు వచ్చాయని, అందుకే సీఎం కేసీఆర్, కవితను అరెస్ట్ చేస్తారని చెప్పారని భావిస్తున్నారు.