జార్ఖండ్ సీఎం సన్నిహిత అధికారిణి దగ్గర 19 కోట్ల అవినీతి సొమ్ము.. - MicTv.in - Telugu News
mictv telugu

జార్ఖండ్ సీఎం సన్నిహిత అధికారిణి దగ్గర 19 కోట్ల అవినీతి సొమ్ము..

May 7, 2022

 

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మరో కొత్త చిక్కులో ఇరుక్కున్నారు. ఆ రాష్ట్రంలో మైనింగ్, ఉపాధి నిధులు దారి మళ్లాయన్న సమాచారంతో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు చేయగా .. రూ. 19.31 కోట్ల అక్రమడబ్బు బయటపడింది. ఈ డబ్బంతా జార్ఖండ్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి పూజా సింఘాల్‌ వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పూజా సింఘాల్ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితమైన అధికారిణి అని సమాచారం. ఉపాధి నిధుల్లో రూ.18 కోట్లు దారిమళ్లాయన్న కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి సన్నిహితుల నుంచి ఇంత డబ్బు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది.

పూజా సింఘాల్ చార్టర్డ్ అకౌంటెంట్ అయిన సుమన్ కుమార్ దగ్గర్నుంచే రూ.17 కోట్లు బయటపడగా.. మిగతా రూ.1.8 కోట్లు ఆమె సన్నిహితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మొత్తం డబ్బులో రూ.2,000, రూ.500, రూ.200, రూ.100 .. ఇలా వేర్వేరుగా నోట్లు కట్టలు గుట్టులుగా ఉండడం చూసి అధికారులు షాక్ అయ్యారు . హేమంత్ సోరెన్ ఇప్పటికే ఓ మైన్ ను తన సొంతానికి కేటాయించుకున్నారని, ఆయనపై సీఎంగా అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులిచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈడీ దాడులు జరపడం హేమంత్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.