ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టు ఈడీని కోరుతూ బుధవారం లేఖ రాశారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్లు, వేర్వేరు కార్యక్రమాల కారణంగా ఇవాళ విచారణకు హాజరుకాలేనని లేఖలో అభ్యర్థించారు. అయితే, కవిత విన్నపానికి ఈడీ స్పందించింది.
కవిత లేఖపై గురువారం స్పందించిన ఈడీ.. కవిత విన్నపానికి ఓకే చెప్పింది. 11వ తేదీన (శనివారం) విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. దీంతో, ఈడీ విచారణపై ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈడీ పర్మీషన్ ఇచ్చిన నేపథ్యంలో రేపు యదావిథిగా జంతర్‌మంతర్ దగ్గర కవిత దీక్ష కొనసాగనుంది. ఇదిలా ఉండే.. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కవిత.. న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, లిక్కర్ స్కాం కేసులోభాగంగా అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించనున్నట్లు పేర్కొంటున్నారు.