ED searches in Hyderabad again..this time in 40 places.
mictv telugu

హైదరాబాద్‌‌: మరోసారి ఈడీ సోదాలు..ఈసారి 40 చోట్ల..

September 16, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి ఈడీ అధికారులు సోదాలను మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని రాయదుర్గంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 40 చోట్ల ఈడీ సోదాలు చేపట్టడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు లిక్కర్ స్కాముకు సంబంధించి, హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ఏపీలోని నెల్లూరు జిల్లాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 25 బృందాలుగా ఏర్పడి, అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే హైదరాబాద్‌లో రెండుసార్లు తనిఖీలు నిర్వహించిన అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. సరైన సమాచారం ప్రకారమే, ఈ సోదాలు జరుగుతున్నాయా? లేక రాజకీయ వ్యూహంతోనే జరుగుతున్నాయా? పదే పదే హైదరాబాద్‌లోనే ఎందుకు సోదాలు చేస్తున్నారు? అనే తదితర అంశాలపై స్థానికులు తెగ చర్చించుకుంటున్నారు.

గతంలో హైదరాబాద్‌లోని కోకాపేట్‌లోని రామచంద్ర పిళె నివాసం, నానక్ రామ్ గూడలోని రాబిన్ డిస్టలరీస్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇవాళ రాయదుర్గంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు, రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్.ఎల్.పి. పేరుతో రామచంద్ర పిళై కంపెనీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సోదాలపై ఈడీ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించపోవటంపై ఆయా సంస్థల అధికారులు మండిపడుతున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ఈడీ రెడ్లు చేస్తుండటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతవారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో సోదాలను నిర్వహించింది. అప్పుడు ఏపీలో ఎటువంటి సోదాలు నిర్వహించని ఈడీ… ఇప్పుడు నెల్లూరులో కూడా సోదాలు నిర్వహిస్తుండటం కలకలం రేపుతుంది.