జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు.. హైదరాబాద్‌లోనూ - MicTv.in - Telugu News
mictv telugu

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు.. హైదరాబాద్‌లోనూ

June 17, 2022

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. ఆయనతో పాటు క్లాస్ 1 కాంట్రాక్టర్ అయిన చవ్వా గోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపైనా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నారు. జేసీ ట్రావెల్స్ స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్‌తో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు వందకుపైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు భావిస్తున్నారు.

ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై తెల్లవారు జాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారుల తనిఖీ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.