ED shock to TRS MP.. 96 crore assets attached
mictv telugu

టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ షాక్.. 96 కోట్ల ఆస్తుల అటాచ్

July 2, 2022

హైదరాబాదులో శనివారం బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీ కార్యక్రమాల మధ్య టీఆర్ఎస్ పార్టీకి షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీకి చెందిన 105 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 96 కోట్లు. ఈ విషయాన్ని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాంచీ నుంచి జంషెడ్ పూర్ వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనుల కోసం 2012లో మధుకాన్ గ్రూపు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంది. అయితే 2017 వరకు పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండా ఉన్నందున నేషనల్ హైవేష్ అథారిటీస్‌కు చెందిన రూ. 264 కోట్లను పక్కదారి పట్టించాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జార్ఖండ్ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణలో మనీ ల్యాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ.. గతేడాది జూన్‌లో నామా నాగేశ్వరరావు నివాసంతో పాటు మధుకాన్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలలో తనిఖీలు చేపట్టింది. తాజాగా బ్యాంకును మోసం చేసిన కేసులో ఎంపీ కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని అర్వింద్ వెల్లడించారు.