ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాంపై తెలంగాణ బీజేపీ నేతలు కవితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కవితకు ఈడీ నోటీసులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మీ తప్పులను ప్రశ్నిస్తే దానిని తెలంగాణ సమాజానికి ఆపాదిస్తారా ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ అంశాన్ని తెలంగాణ సమాజంతో ముడిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు, అక్రమ సంపాదన చేసింది మీరేనని కవితనుద్దేశించి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగస్వామ్యమై సంపాదించారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దర్యాప్తు సంస్థల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక ఈ విషయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈడీ నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు స్వచ్చందంగా పనిచేస్తాయి. లిక్కర్ స్కాం కేసులో నిందితులు నాకు తెలుసని గతంలో కవితే చెప్పారు. దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలి. ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.
మరో బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పందిస్తూ.. ‘తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవితగారు ఒక్కరేనా.. తెలంగాణలో ఉన్నది ఆమె ఒక్కరేనా ఏందీ…’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య కాదని అన్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న మిగతా అందరితో పాటూ కవిత కూడా ఒకరని, కల్వకుంట్ల కవిత ఏమీ స్పెషల్ కాదు అన్నారు. ఢిల్లీ మధ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరికీ ఇచ్చినట్టే కవితకు నోటీసులు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర లేకపోతే అదే విషయాన్ని ఈడీకి చెప్పాలి అని కామెంట్స్ చేశారు.