కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ అగ్రనేత.. రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 8న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
కాగా, సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇప్పుడు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేయడం ఏంటని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విమర్శించారు. అయితే, సోనియా జూన్ 8న ఈడీ కార్యాలయానికి వెళ్తారని , రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆ లోపు తిరిగి వస్తే ఈడీ ఎదుట హాజరవుతారని, రాలేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. 1942లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారు, ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇందుకోసం ఈడీని ఉపయోగిస్తోందని పేర్కొన్నారు.