ed,it rides on trs mp gayatri ravi
mictv telugu

మరో టీఆర్ఎస్ ఎంపీ ఆఫీస్‌పై ఈడీ సోదాలు

November 10, 2022

తెలంగాణలోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ మెరుపు దాడులు చేస్తోంది. నిన్న(బుధవారం) మంత్రి గంగుల కమలాకర్, అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ, ఐటీ అధికారులు.. నేడు టీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని ఆఫీస్‌తో పాటు కరీంనగర్‌ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

బుధవారం నుంచి మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రానైట్ కంపెనీలతో పాటు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాలు, గ్రానైట్ కంపెనీలలో కూడా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్‌లో ఉన్న గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్, మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో తనిఖీలు జరిగాయి. గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో గుంగుల కమలాకర్ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఐటీ, ఈడీ సోదాలపై సమాచారం అందిన వెంటనే.. ఆయన హుటాహుటిన కరీంనగర్‌‌కు వచ్చారు.