జగన్ సర్కారు జీవోపై ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సర్కారు జీవోపై ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం

November 8, 2019

మీడియాను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదమని, ఇలాంటి నిరంకుశ చట్టాలు ప్రజాస్వామ్యానికి కీడు చేస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. ఇది మీడియా పనితీరును దెబ్బతీస్తుందని పేర్కొంది. 

మీడియా స్వేచ్ఛను హరించే ఈ జీవోను వెంటనే వాపసు తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యక్తులకు మాత్రమే సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్(పరువునష్టం) కేసులను ఇప్పుడు ప్రభుత్వమే మీడియాపైనా పెట్టడం సెన్సార్షిప్ కిందికే వస్తుందని ప్రకటనలో పేర్కొంది. జీవో ద్వారా ప్రభుత్వ అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారని, ఫలితంగా అధికార దుర్వినియోగం అవుతుందని గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త జోవో ద్వారా ఆ విభాగాల కార్యదర్శలు మీడియాపై రీజాయిండర్లు, ఫిర్యాదులు చేయడానికి, కేసులు పెట్టడానికి అధికారం కల్పించారు. ఇదివరకు ఇలాంటి అధికారాలు సమాచార కమిషనర్లు మాత్రమే ఉండేవి.