పాఠశాలలే ప్రగతికి మెట్లు. మరి ఆ పాఠశాలలో టీచర్లే కరువైతే ఇక విద్యను అందించేదెవరు? రేపటి పౌరులను తీర్చిదిద్దేదెవరు? భారతదేశంలోని దాదాపు 1.2 లక్షల పాఠశాలల్లో ఒక్కో టీచర్ చెప్పునే ఉన్నారు. ఇది దేన్ని సూచిస్తుందంటారు?
2023-24 యూనియన్ బడ్జెట్ లో కేంద్రం విద్యా రంగానికి 1.13 లక్షల కోట్లు కేటాయించింది. 2022-23తో పోలిస్తే పాఠశాల, ఉన్నత విద్య పై అంచనా వ్యయం సుమారు 8.3శాతం పెరిగింది. భారతదేశంలో విద్య ప్రమాణాలను పెంచడానికి అవకాశం ఉంది. విద్య సిబ్బంది కొరత ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. విద్యను డిజిటలైజ్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ భారతదేశంలోని ప్రతి నాలుగు పాఠశాలల్లో కేవలం ఒక దాంట్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందంటే మనం ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నమో అర్థం చేసుకోవచ్చు.
వేలల్లో ఖాళీలు..
పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాదు.. అందులో బోధనా సిబ్బందిని నియమించడం ప్రభుత్వ కర్తవ్యం. అలాంటిది భారతదేశంలోని దాదాపు 1.2 లక్షల స్కూళ్లలో ఒక్కో టీచర్ ఉండడం నిజంగా మింగుడుపడని విషయం. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో 58వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో 12,099 టీచింగ్ పోస్టులు, 1, 312 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలున్నాయి. ఇవేకాకుండా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 3,271, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,756 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
భారతదేశంలో దాదాపు 8శాతం పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా మధ్యప్రదేశ్ లో ఈ నిష్పత్తి 25శాతంగా ఉంది. ఒక్క కేరళలో మాత్రమే తక్కువ పాఠశాలల్లో అంటే 310 పాఠశాలల్లో మాత్రమే ఒక ఉపాధ్యాయుడు కలిగి ఉన్నారు. విద్యను డిజిటలైజ్ చేయడానికి కూడా నాలుగు పాఠశాలల్లో కేవలం ఒక పాఠశాలలో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. దీనివల్ల డిజిటల్ ప్రోగ్రామ్ ల అమలు కూడా కష్టతరం అవుతుంది.