తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్

March 23, 2021

 

 

photo

కరోనా రెండో ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు మినహా మొత్తం విద్యాసంస్థలన్నీ రేపటి నుంచి మూతపడనున్నాయి. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. విద్యాసంస్థలు మూసి వేయాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, పిల్లల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని తెలిపారు.

వైద్య కళాశాలలు తప్ప మిగతా అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి. పొరుగు రాష్ర్టాలలో విద్యాసంస్థలు మూసేశారని ఆమె గుర్తు చేశారు. అయితే ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోందని, విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి గనుక, కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ‘ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటినుంచి (24.3.2021) తాత్కాలికంగా మూతపడతాయి. వైద్య కళాశాలలు మినహాయించి, రాష్ర్టంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి’ అని ఆమె తెలిపారు.