Efforts of these evil forces should be thwarted: KCR
mictv telugu

ఈ దుష్ట శక్తుల ప్రయత్నాలను తిప్పి కొడదాం: కేసీఆర్

September 17, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నేడు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా కేసీఆర్..జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసు వందనం స్వీకరించారు.

కేసీఆర్ మాట్లాడుతూ..”ముందుగా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో రాచరిక పాలన కొనసాగింది. ఆ తర్వాత ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించింది.

ఆ తర్వాత 1948 నుంచి 1956 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి ఉండేది. మేము దోపిడీకి గురవుతున్నామనే భావన ప్రజల్లో రోజు రోజుకూ పెరిగింది. స్వరాష్ట్రం ఆకాంక్ష బలపడింది. ఆ తర్వాత ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం నేను పోరాటం చేశాను. నిరాహార దీక్షకు దిగాను. చావు అంచుల వరకు వెళ్లాను” అని ఆయన అన్నారు.

అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మౌళిక వసతులను ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొందరు మతతత్వంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలందరూ ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మనుషుల మధ్య విభజన చేస్తూ, సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని ఈ విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయని, ఈ దుష్ట శక్తుల ప్రయత్నాలను ప్రజలందరూ కలిసి తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెసిఆర్ పిలుపునిచ్చారు.