కోడిగుడ్లు పేలి.. నరక యాతన..
వెబ్‌సైట్, యూట్యూబుల్లో చూసి వంటలు చేయడం నేటి తరానికి అలవాటైపోయింది. కొత్తరకం వంటకాలు చేయడానికి అందులో చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇది మంచికే అయితే ఏం సమస్యలేదు. కానీ ఇంగ్లాండ్‌కు చెందిన ఓ యువతి వెబ్‌సైట్లో చూసి వంట చేస్తుండగా ప్రమాదానికి గురైంది. తన కంటికి తీవ్రంగా గాయం కావడంతో త్రుటిలో అపాయం తప్పింది.
బెదానీ రాసర్(22) అనే యువతి కోడిగుడ్లతో సరికొత్త వంటకం తయారు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఓ వెబ్‌సైట్లో చెప్పినట్టుగా మైక్రో ఓవెన్‌లో కోడి గుడ్లను పెట్టింది. అవి ఓవెన్‌లో పేలకుండా ఉండాలంటే ఉప్పు రాయాలని చెప్పినట్టుగానే చేసింది. కానీ అందులో గుడ్లు పేలలేదు కానీ బయటకు తీసిన వెంటనే పేలిపోయాయి. ఆమె మొహంపై పడటంతో కంటికి తీవ్ర గాయం అయింది. కొంచెం అటూ ఇటూగా అయితే కన్ను పోయేదని వైద్యులు చెబుతున్నారు. కన్ను బాగా వాచిపోవడంతో ఇప్పుడు చూడటానికి ఇబ్బందిగా మారింది.
ఇంత జరిగినా బాధితురాలు చెప్పిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఓవెన్‌లో గుడ్లు పెడితే పేలుతాయని తనకు తెలుసని చెప్పింది. గతంలో తన కజిన్‌కు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని తెలిపింది. కానీ వెబ్‌సైట్లో చెప్పినట్టుగా చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని అలా చేసినట్టు వెల్లడించింది. తెలిసి కూడా పిచ్చి చేష్టలతో ప్రమాదం కొని తెచ్చుకోవడం అంటే ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వంటచేసే సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని.. ఎవరో ఏదో చెప్పారని చేస్తే ప్రమాదాలకు మనం బలికావాల్సి వస్తుందని పలువురు సూచిస్తున్నారు.