Ego war between Telangana governor tamilisai and state government
mictv telugu

రాజ్‌భవన్ Vs ప్రగతి భవన్.. ఈగోనే అసలు సమస్య!

March 3, 2023

Ego war between Telangana governor tamilisai and state government

తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వంతో ఏదో ఒక అంశంపై పేచీ పడుతూనే ఉన్నారు. కేసీఆర్ సర్కారు కూడా తనదైన శైలిలో ఆమెతో తలపడుతోంది. తమలపాకుతో నువ్వొకటంటే తులుపుచెక్కతో నేనొకటంటా చందంగా రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య సాగుతున్న గొడవ కొన్నాళ్లుగా సద్దుమణిగింది. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో తమిళిసై, సీఎం కేసీఆర్ నవ్వుతూ పలకరించుకున్నారు. ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరిందని అందరూ భావించారు. ఇంతలో ఏమైందో ఏమోగాని గవర్నర్ పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఏకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసులో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేశారు సీఎస్.

ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గర

తనను సంప్రదించకుండా సుప్రీంను ఆశ్రయించడంపై గవర్నర్ మండిపడ్డారు. ఈ వ్యవహారం ట్విటర్లో దుమ్మెత్తిపోశారు. ‘‘ప్రియమైన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ చాలా దగ్గర. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మీకు అధికారికంగా రాజ్ భవన్‌కు వచ్చే సమయం లేకపోయింది. ప్రొటోకాల్ లేదు. మర్యాద లేదు. స్నేహాపూర్వక అధికారిక సంప్రదింపులతో సమస్యలకు పరిష్కారమవుతాయి. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. రాజ్ భవన్ ఢిల్లీకంటే దగ్గరే అని మరోసారి గుర్తుచేస్తున్నాను’’ అని గవర్నర్ ట్వీటారు.

జనం స్పందనేమిటి?

ఆమె ట్వీట్‌పై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో గవర్నర్‌పైనా, శాంతికుమారిపైనా విమర్శలు వస్తున్నాయి. భేషజాలకు పోకుండా పనిచేసుకోండి అని నెటిజన్లు అంటున్నారు. ‘గవర్నర్ గారూ.. మీకు ట్వీట్లు చేసేందుకు సమయం ఉంటుందిగాని సంతకాలు చేయడానికి టైమ్ ఉండట్లేదు. మీ బీజేపీ అధిష్టానం మెప్పుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయకండి’’ అని అంటున్నారు. మరికొందరు ప్రభుత్వన్ని తిడుతున్నారు. ‘‘ప్రథమపౌరురాలికే గౌవరం లేదు. సీఎస్ అంత బిజీగా ఉన్నారా?’’ అని మండిపడుతున్నారు.

ఏం బిల్లులు పెండింగులో ఉన్నాయి?

గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఐదు నెలలైనా ఆమోదించడం లేదని, అభ్యంతరాలు కూడా చెప్పకుండా నాన్చుతున్నారని వాపోతోంది. మునిసిపల్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్ గ్రేడ్ బిల్లు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు పెండింగులో ఉన్నాయి.

ఆమె అలా, ఈయన ఇలా..

గవర్నర్, సీఎంల మధ్య పొరపొచ్చాలు చాలాసార్లే బయటపడ్డాయి. తమిళిసై బీజేపీ నేపథ్యం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తను అభిమానించే పార్టీని ప్రభుత్వం నిత్యం తిడుతుండడం గవర్నర్‌కూ ఇబ్బంది కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా భావోద్వేగాల అణచేసుకోవడం సాధ్యం కాదు. తన దగ్గరికి వచ్చి వివరంగా మాట్లాడి పనిచేయించుకోవాలన్నది తమిళిసై పంతం. ఆమెతో పనేమిటి, ప్రజలు ఎన్నుకున్న తామే తోపులమని, తాము చెప్పినట్టే ఆమె నడుచుకోవాలన్నది ప్రభుత్వం పట్టుదల. ఎమ్మెల్సీ పాడి కౌశిక్, మంత్రి తలసాని శ్రీనివాస్ వంటి కొందరు బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌ను నోటికొచ్చినట్లు తిడుతూ తర్వాత సారీ చెప్పడం మామూలైపోయింది. తన పర్యటనల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, తనను నిర్లక్ష్యం చేస్తున్నారని తమిళిసైకి కోపం. ఇవన్నీ రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సాగే వ్యవహారాలపై ఈ భేషజాల ప్రభావం కనిపిస్తోంది. రాజ్‌భవన్‌పై సుప్రీం కోర్టుకెక్కే ముందు ప్రభుత్వం న్యాయసలహా తీసుకుందో లేదో తెలియడం లేదు. గవర్నర్ తమకు సహకరించడం లేదంటూ జాతీయ స్థాయిలో టాంటాం వేయడానికే ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా కోర్టుకెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. కొరకరాని కొయ్యగా మారిన తమిళిసైకి ఎన్నికలయ్యేలోపు స్థానభ్రంశం కల్పించాలే ఎత్తుగడ కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.