భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

November 27, 2022

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ అల్‌సిసీ ముఖ్య అతిథిగా రానున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. భారత గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా రావడం అన్నది ఇదే మొదటిసారి అని కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. భారత్‌-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాయి.

గత నెల 16న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కైరోలో పర్యటించారు. ఆ సమయంలోనే ప్రధాని మోడీ లాంఛనప్రాయ ఆహ్వానాన్ని ఆ దేశ అధ్యక్షుడికి అందజేశారు. భారత, ఈజిప్టు దేశాల మధ్య స్నేహసంబంధాలు చిరకాలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఆధ్వర్యంలో జరగనున్న 2022-23 జి 20 సమావేశాలకు ఈజిప్టును అతిథిగా ఆహ్వానించారు. ఈ రెండు దేశాలు 1950 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. నాడు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నోను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1952, 1953,1966 సంవత్సరాల గణతంత్ర దినోత్సవానికి ఏ విదేశీ నాయకుడిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించలేదు.

2007లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, 2008లో ఫ్రెంచ్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్, 2020లో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథులుగా వచ్చారు. 2021లో బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం జరిగింది. కానీ బ్రిటన్‌లో కొవిడ్19 కేసులు పెరిగిపోయినందున ఆయన సందర్శన రద్దయింది.