Egyptian court sentences Mohamed Adel to death
mictv telugu

ఉన్మాదికి ఉరిశిక్ష దేశమంతా చూడాలి.. లైవ్ టెలికాస్ట్ చేయండి : కోర్టు

July 29, 2022

ప్రేమ పేరుతో యువతుల జీవితాలను నాశనం చేసే మ‌ృగాళ్ల విషయంలో ఈజిప్టు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ, పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో యువతిని చంపిన ఉన్మాదికి ఉరిశిక్ష వేసింది. అంతేకాక, అతడి ఉరిని దేశమంతా చూసేలా ప్రత్యక్ష ప్రసారం చేయాలని, భావితరాలకు గట్టి గుణపాఠంలా ఉండాలని నిర్ణయించింది. చట్టప్రకారం కఠిన శిక్షలు పడకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయనీ, ఈ శిక్ష వల్ల గట్టి సందేశం వెళ్తుందని అభిప్రాయపడింది. వివరాల్లోకెళితే.. ఉత్తర ఈజిప్టులోని మాన్‌సోరా యూనివర్సిటీలో చదువుతున్న మొహమద్ ఆడెల్.. తన తోటి విద్యార్ధిని నయోరా అష్రాఫ్‌ను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించేవాడు. తర్వాత ఒప్పుకోవట్లేదని అతి కిరాతకంగా చంపేశాడు. ఘాతుకానికి సంబంధించి వీడియోలు బయటికి రావడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారించిన కోర్టు జూన్ 28న నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. తర్వాత ఇలాంటి వారికి బుద్ధి వచ్చేలా ఉరిశిక్ష అమలును దేశమంతా ప్రత్యక్ష ప్రసారం చేయాలని పార్లమెంటుకు లేఖ రాసింది. ఇలాంటి దుర్మార్గ ఘటనలు పునరావృతం కాకూడదంటే చట్టసభ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని లేఖలో పేర్కొంది. అయితే న్యాయపరంగా క్షమాభిక్ష పొందేందుకు హంతకుడికి నెల రోజుల సమయం ఉంది. మరి ఈ లోపు ఏం జరుగుతుందో చూడాలి. కాగా, 1998లో రాజధాని కైరోలో ఓ మహిళ, ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన ముగ్గురు నిందితుల ఉరిశిక్షను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.