హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబుల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిదో నిజాం రాజు మృతి కన్నమూశారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ముకర్రం జా బహదూర్ అని పిలువబడే మీర్ భర్కత్ అలీ ఖాన్ మృతి చెందినట్లు ఆయన కార్యాలయం, కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీఖాన్ వాలాషన్ ముకర్రం జహ్ బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో గత రాత్రి 10.30 గంటలకు మరణించారని తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాం’ అని ప్రకటనలో తెలిపారు. ఇక ఈ నెల 17వ తేదీన కుటుంబ సభ్యులు ముకర్రం జా భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.
తన స్వస్థలమైన హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయాలన్న నిజాం రాజు కోరిక మేరకు, అతని పిల్లలు మంగళవారం నాడు దివంగత నిజాం భౌతికకాయంతో హైదరాబాద్‌కు రానున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నగరానికి రాగానే ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో మృతదేహాన్ని ఉంచనున్నారు. అవసరమైన ఆచార వ్యవహారాలను పూర్తి చేసిన తర్వాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.
హైదరాబాద్ ఏడవ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1954 జూన్ 14న ప్రిన్స్ ముకర్రం జా ను తన వారసుడిగా ప్రకటించారు. 1971 వరకు ముకర్రం జా.. హైదరాబాద్ యువరాజుగా పిలిచారు. 1954 నుండి హైదరాబాద్ ఎనిమిదో రాజుగా గుర్తించారు. 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని సంస్థానాలను రద్దు చేసింది.