భక్తుల కొంగు బంగారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనూహ్యమైన కానుక అందింది. ఓ ముస్లిం భక్తురాలు భూరి కానుకలు సమర్పించుకుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రం జా మాజీ భార్య ప్రిన్సెస్ ఎస్రా బిర్జిన్ 67 గ్రాముల విలువైన బంగారు నగలను సమర్పించుకున్నారు. వీటి విలువ రూ.5 లక్షలకుపైనే. ఆమె తరఫున యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి.కృష్ణారావు వీటిని సంబంధిత అధికారులకు అందజేశారు. ఎస్రా స్వస్థలం టర్కీ. ఆమె తరచూ హైదరాబాద్ వస్తుంటారు. నిజాం పాలకులు గతంలోనూ యాదాద్రికి కానుకలు అందజేశారు. ఎస్రా మాజీ భర్త, 8వ నిజాం ఇటీవల టర్కీలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె వయసు 90 ఏళ్లు. ముకర్రం జాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నిజాం ఆస్తులకు మరమ్మతులు చేయించారు.