ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడు..

September 13, 2019

ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కోవడం, ఆర్థిక మాంద్యం ప్రభావాన్నివివరించడంలో కేంద్ర మంత్రులు తడబడిపోతున్నారు. కారణాలు చెప్పడంలో ఎవరికి వారు ఇష్టంవచ్చిన వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలవుతున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటోమొబైల్ రంగం కుదేలు కావడానికి యువత కార్లను కొనేందుకు ఆసక్తి చూపకపోవడమే అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేశారు. తాజాగా మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తన వ్యాఖ్యలతో నెటిజన్లకు దొరికిపోయాడు. 

గురువారం ఆయన ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధపడి అబాసుపాలయ్యారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇంట్లో కూర్చొని లెక్కలు వేయకండి అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చాడు. ‘ముందు గణితాన్ని మర్చిపోండి.. గణితాన్ని పట్టుకొని ఉంటే ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కునే వాడు కాదు. కేవలం గణితమే ముఖ్యమైతే ఏ ఆవిష్కరణలు ప్రపంచంలో జరిగి ఉండేవి కాదు’. అంటూ వ్యాఖ్యానించారు.

నిజానికి గురత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది ‘న్యూటన్’. కానీ కేంద్ర మంత్రి మాత్రం ఐన్‌స్టీన్ అంటూ వ్యాఖ్యానించి నెటిజన్లకు దొరికిపోయాడు. దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. ఆయన మాటలకు నెటిన్లు కౌంటర్ ఇస్తున్నారు.