అపర కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్‌ను కొనుగోలు చేసి వార్తల్లోకెక్కిన ఎలాన్ మస్క్ తాజాగా జనాభా నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరిగితే భూమికి భారం అని చాలా మంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారని, ఇది చాలా తప్పని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులకు పిల్లలు లేకపోవడమో లేక ఒకరే సంతానం కలిగి ఉంటారని వెల్లడించారు. మిగతా ధనవంతులతో పోలిస్తే తనకే ఎక్కువ సంతానం ఉందని తెలిపారు. ఏడుగురు పిల్లలతో తాను ప్రత్యేకంగా నిలిచినట్టు సమర్ధించుకున్నారు. అంతేకాక, పిల్లలను కనడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని చాలా మంది భావిస్తారనీ, జనాభా రెట్టింపు అయినా పర్యావరణానికి ఏమీ కాదని చెప్పుకొచ్చారు. ‘పర్యావరణం గురించి నాకు బాగా తెలుసు. జపాన్‌లో అతితక్కువ జనన రేటు ఉంది. అమెరికాలో జననాల రేటు రానున్న 50 ఏళ్ల పాటు నాగరికత కొనసాగించడం కంటే తక్కువగా ఉంది. నాగరికత కోసం పిల్లలను కనడం తప్పనిసరి. మన సౌలభ్యం కోసం నాగరికతను తగ్గించకూడదు. ఇప్పటికే చైనాలో కూడా జననాల రేటు కూడా చాలా తగ్గిపోయింది. తర్వాతి తరాలు లేకపోతే మనం సాధించేదంతా ఎవరి కోసం? ఎందుకోసం? అంటూ అభిప్రాయపడ్డారు. వీటితో పాటు జనాభా గ్రాఫ్ రేటును కూడా ఆయన పంచుకున్నారు. కాగా గతంలో కూడా ఎలాన్ మస్క్ సంతానంపై వ్యాఖ్యలు చేశారు.