ఏకాకికి పోలీసుల సర్‌ప్రైజ్… కన్నీళ్లతో థ్యాంక్స్
కరోనా మహమ్మారి నివారణలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించగా.. ఆసుపత్రుల్లో వైద్యులు, రోడ్ల మీద పోలీసులు, పారిశుద్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రోడ్ల మీద నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఆవారాగాళ్ల వీపులు వాయిస్తున్న పోలీసులు.. మరోవైపు ఎన్నో మంచి పనులు కూడా చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమై.. ఒంటరిగా జీవిస్తున్న ఓ వృద్ధుడి పుట్టినరోజు సందర్భంగా కేకు తీసుకువెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఆ పెద్దాయన ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పంకజ్ నైన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
పంచకుల మహిళా పోలీసులు గేటు మూసి ఉన్న ఓ ఇంటి వద్దకు వెళ్లడంతో వీడియో ప్రారంభం అవుతుంది. లోపల ఎవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నిస్తారు. ‘నా పేరు కరణ్ పురి. సీనియర్ సిటిజన్‌ను. ఇంట్లో ఒక్కడినే ఉంటున్నా’ అని లోపలినుంచి ఆ పెద్దాయన బయటకు వచ్చారు. ఇంతలో కేకు బయటకు తీసిన పోలీసులు.. హ్యాపీ బర్త్‌డే అంటూ ఆయనను విష్ చేశారు. ఊహించని పరిణామంతో సదరు పెద్దాయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో కేక్ కట్ చేయించి నోరు తీపి చేశారు. ‘మేము కూడా మీ కుటుంబ సభ్యుల వంటివాళ్లమే’ అని ధైర్యం చెప్పడంతో.. కరణ్ పురి కన్నీటిపర్యంతమయ్యారు.
‘లాక్‌డౌన్‌లో ఒంటరితనంతో బాధ పడుతున్న నన్ను ఇలా సంతోషపెట్టిన పోలీసులకు ధన్యవాదాలు’ అని ఆయన ఆనందభాష్పాలు కార్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల చర్యకు ఫిదా అవుతున్నారు. వాహ్ పోలీస్ అని అభినందిస్తున్నారు.
#WATCH Panchkula Police surprise Karan Puri, a senior citizen in Sector 7, on his birthday, amid COVID19 lockdown. (Source: Panchkula Police) #Haryana pic.twitter.com/9DRC8qpsLU
— ANI (@ANI) April 28, 2020