కరోనా సోకిన వృద్ధురాలిని కట్టేశారు.. ఎంపీ ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సోకిన వృద్ధురాలిని కట్టేశారు.. ఎంపీ ఆగ్రహం

October 24, 2020

Elderly patient tied to bed at hospital, says MP.jp

కరోనా వైరస్ సోకిన ఓ వృద్ధురాలి పట్ల ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. కరోనా కారణంగా మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆమెను మంచానికి కట్టేశారు. దీంతో ఆమె కిందపడగా తలకు గాయాలు అయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి వర్గాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళకు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురికి ఇటీవల కరోనా సోకింది. వారికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే వృద్ధురాలి(67)కి కరోనా కారణంగా మానసిక వైకల్యం సంభవించింది. దీంతో ఆమెను కరోనా కేంద్రం నుంచి ఈ నెల 20న త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ వృద్ధురాలిని చూసేందుకు వెళ్లిన బంధువులు ఆమె పరిస్థితి చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

వృద్ధురాలు నేలపై పడటంతో తలకు గాయాలు అయ్యాయి. మరోవైపు ఆమె చేయి మంచానికి కట్టేసి ఉంది. తోటి రోగులు ఇదంతా వీడియో తీశారు. ఆసుపత్రి తీరుపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు మండిప్డడారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాపన్‌ స్పందించారు. ఈ మేరకు కేరళ ఆరోగ్యమంత్రి శైలజాకు లేఖ రాశారు. త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజీలో మానసిక వైద్యులు లేనప్పటికీ ఆమెను అక్కడికి ఎందుకు తరలించి చికిత్స అందిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి వర్గాలు వివరణ ఇచ్చారు. సెలైన్‌ ఎక్కించే కాన్యులాను ఆమె తొలగిస్తుండటంతో చేతిని కట్టామని తెలిపారు. మంచం పైనుంచి ఆమె కిందపడటం దురదృష్టకరమని అన్నారు. తలకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని పేర్కొన్నారు.