Election Commission allows citizens above 17 years to apply in advance for Voter ID card
mictv telugu

17 ఏళ్లు నిండితే చాలు.. ఓటరు కార్డ్ మంజూరు

July 28, 2022

ఓటరు గుర్తింపు కార్డు కోసం 18 ఏళ్లు నిండే వరకు వేచి ఉండక్కర్లేదని చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్‌ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది.

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్‌ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం ఈసీ యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చనుంది. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి.