మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి ఈసీ భారీ షాక్ ఇచ్చింది. అసలు శివసేన తిరుగుబాటు వర్గం నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే అని తేల్చి చెప్పేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకున్నట్టయింది. అలాగే శివసేన పేరు, ఆ పార్టీ గుర్తు విల్లు – బాణం గుర్తును ఉద్దవ్ కోల్పోయారు. తన తండ్రి స్థాపించిన పార్టీ ఇప్పుడు తనది కాకుండా పోవడంతో ఉద్దవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజా పరిణామంలో ఎనిమిది నెలల ఉత్కంఠకు తెరపడినట్టయింది. అయితే దీన్ని ఉద్ధవ్ వర్గం వ్యతిరేకిస్తోంది. ఎన్నికల గుర్తు కేటాయింపు అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, దీనిపై ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. ఈసీ అధికారులు బీజేపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని విమర్శించారు. కాగా, మహా వికాస్ అఘాడీ కూటమిని వ్యతిరేకిస్తూ గత జూన్‌లో కొందరు శివసేన ఎమ్మెల్యేలతో షిండే బయటకు వచ్చేశారు. తర్వాత బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, షిండే వర్గం రెండు కూడా అసలు శివసేన గుర్తింపు కోసం న్యాయపోరాటానికి దిగాయి. ముందుగా థాక్రే వర్గం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. గత జనవరి నెలలో అసలు శివసేన తమదేనంటూ రెండు వర్గాలు ఈసీకి రాతపూర్వకంగా వివరాలు సమర్పించారు. పరిశీలించిన పోలింగ్ విభాగం తాజాగా షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయిస్తూ అధికారిక ప్రకటన చేసింది.