రామారావు ఆన్ డ్యూటీ తరహా బిల్డప్.. ఐఏఎస్ డిబార్ - MicTv.in - Telugu News
mictv telugu

రామారావు ఆన్ డ్యూటీ తరహా బిల్డప్.. ఐఏఎస్ డిబార్

November 18, 2022

సోషల్ మీడియా యుగం నడుస్తున్న ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ సొంత ప్రచారం కోసం ఆరాటపడుతున్నారు. దీనికి మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు కూడా అతీతులు కారు. హుందాగా నడుచుకోవాల్సిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అత్యుత్సాహం చూపించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆగ్రహించిన ఎన్నికల సంఘం మీ సేవలు మాకవసరం లేదు. దయ చేయండి అని సున్నితంగా చెంప దెబ్బ రుచి చూపించింది.

ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఆఫీసర్ అయిన అభిషేక్ సింగ్ ని గుజరాత్ ఎన్నికల కోసం పరిశీలకుడిగా ఈసీ నియమించింది. అహ్మదాబాద్, బాపూనగర్, అస్వారా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. ఈ విషయాన్ని అభిషేక్ సింగ్ అత్యుత్సాహంతో ‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా నియామకమయ్యాను’ అంటూ ప్రభుత్వం వాహన ఫోటోతో సహా ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇది తెలిసిన ఈసీ గుర్రుమంది. అధికార హోదాను పబ్లిసిటీ స్టంటు చేసిన అధికారిని తప్పుపడుతూ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. అంతేకాక, శుక్రవారం నియోజకవర్గం వదిలిపెట్టి వెళ్లాలని, కేటాయించిన అన్ని సౌకర్యాలు రద్దవుతాయని ఆదేశించింది. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించింది. కాగా, గుజరాత్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు విడుదలవుతాయి.