Election Commission of India suspends former RO KMV Jagannadha Rao of Munugode
mictv telugu

మునుగోడు మాజీ ఎన్నికల అధికారి సస్పెండ్

October 28, 2022

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావును సస్పెండ్‌ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. అధికారం లేకున్నా జగన్నాథ రావు ఓ అభ్యర్థికి గుర్తును కేటాయించడం కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఈసీకి ఫిర్యాదు అందగా.. విచారణ నిర్వహించి ఎన్నికల బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పించి వెంటనే అప్పట్లో మరో అధికారిని నియమించారు.

తాజాగా ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ‘‘తక్షణం ఆయన సస్పెన్షన్‌ అమలులోకి వస్తుంది. ఆ ఉత్తర్వులను జారీ చేసి శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా దిల్లీ పంపాలి. ఎన్నికల అధికారికి తగినంత భద్రత కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత డీఎస్పీని బాధ్యుడిని చేయండి. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటు ఎన్నికల అధికారికి భద్రత కల్పించడంలో విఫలమైన డీఎస్పీపై సీరియస్ అయ్యింది. క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.