నంద్యాల బై పోల్ లో సరి కొత్త ప్రయోగం... - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాల బై పోల్ లో సరి కొత్త ప్రయోగం…

August 21, 2017

నంద్యాల ఉప ఎన్నికల్లో ఈసీ తొలి సారి ఓ ప్రయోగం చేస్తున్నది.ఓటర్లు ఓటు వేసిన వెంటనే ఎవరికి ఓటు వేశారో… దానికి సంబంధించి  ప్రింట్ చీటీ  సీక్రెట్ బాక్స్ లో పడుతుంది.  రిగ్గింగ్ లాంటివి జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది.  ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు అధికారులు.110 పోలింగ్ కేంద్రాలు, 255 పోలింగ్ బూత్ లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 71 బూత్ లు సమస్యాత్మకంగా ఉన్నాయని అధికారులు  గుర్తించారు…. 104 వరకు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయని గుర్తించారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు.

నంద్యాల నియోజకవర్గంలో 2 లక్షల 18 వేల 852 మంది ఓటర్లున్నారు. ఇందులో ఎంత మంది  తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో తెలియదు. అయితే  నెల రోజుల నుండి ప్రచారం మరీ తీవ్రం చేశాయి పార్టీలు. అధికార టిడిపి, విపక్ష వైసీపీల పెద్ద నాయకులు అక్కడే తిష్ట వేశారు. అధికార పార్టీ ముఖ్యనాయకులంతా  అక్కడే ఉంటున్నారు. వైసీపీ అధ్యక్షునితోపాటు ముఖ్యులూ అక్కడే ఉన్నారు.

2019 ఎన్నికలకు  ఇదీ సెమీఫైనల్ గా  చెప్పుకుంటున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రభావం నిజంగానే వచ్చే ఎన్నికలపై ఉంటుందా లేదా తెలియదు కానీ నాయకులు మాత్రం జనాలకు అట్లాంటి అభిప్రాయం కల్పించారు. రెండుతెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం అవుతున్నది. ఇరు పార్టీల ముఖ్యనాయకులు ప్రతీ మాటను అక్కడి ఓటర్లే కాదు… ఇతరప్రాంతాల వారూ జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఈ ఉప ఎన్నిక జరుగుతున్నది. నంద్యాలకు ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలు పొందారు. ఈ సారి రెండుపార్టీలకు చెందిన అభ్యర్థులు బలంగా ఉన్నారు. స్వతంత్రుల ప్రభావం ఈ సారి  లేదు.

అయితే గెలుపుపై  ఎవరి ధీమా వారికుంది.  బంపర్ మెజార్టీతో  గెలుస్తామని  ఎవ్వరూ చెప్పడం లేదు. కాకా పోతే గెలుస్తామని అంటున్నారు.  ప్రచారం జరుగుతున్న తీరును బట్టి చూస్తే ఇరు పార్టీల మధ్య హోరా హోరీ ఉంది. గెల్చినా ఓడినా  కొన్ని వందల ఓట్ల తేడా ఉంటుందనే అంచనాకు  వస్తున్నారు విశ్లేషకులు.  ఈనెల 21న ప్రచారం ముగుస్తుంది. 23న పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత  అధికార, విపక్షాల  భవిష్యత్తు బయట పడుతుంది.