ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. బుధవారం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఏర్పాటు చేసిన తెలుగు రైతు విభాగం వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందిలే అనుకోవద్దు” అని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ఈసారి ఏపీలో టీడీపీ 160వ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని అచ్చెన్నాయుడు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
మరోపక్క సినిమా ఇండస్ట్రీపై జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, కార్యకర్తలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ఏపీ ప్రజలు విరక్తి చెందారని, అందుకే ముందుగానే ఎన్నికలు జరుగనున్నాయని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.