electric double decker buses Tenders will be called in a week: Minister Puvvada
mictv telugu

HYDలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు.. మంత్రి పువ్వాడ

November 2, 2022

నగరంలోని ఆర్టీసీ ప్రయాణీకులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభవార్త చెప్పారు. నగర రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పనున్నట్టు వెల్లడించారు. ఇందుకు వారంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని, అద్దె ప్రాతిపదికన నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్ దాఖలు చేసుకోవాలని సూచించారు. బిడ్ గెలుచుకున్న కంపెనీకి ఆర్టీసీ అద్దె చెల్లిస్తుందని, అయితే ఆర్టీసీ నిర్ణయించిన రూట్లు, ధరలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. సిటీలోని మూడు వేర్వేరు రూట్లలో ఈ 10 బస్సులను తిప్పాలని ప్రాథమికంగా ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ఫ్లై ఓవర్లు లేని కోటి – పటాన్ చెఱు, జీడిమెట్ల – సీబీఎస్, అఫ్జల్ గంజ్ – మెహదీపట్నం రూట్లను పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఈ విధానంలో ఇదివరకే ముంబైలో బస్సులు తిరుగుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. స్విచ్ మొబిలిటీ 22 మోడల్ బస్సుల డిజైన్ దేశంలోనే తయారు చేయడం విశేషం. కాగా, డబుల్ డెక్కర్ బస్సు అనేది 90వ దశకంలో పుట్టిన వారికి సుపరిచితమే. ఆ తరహాలో మళ్లీ బస్సులను ప్రవేశపెట్టమని మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. దానికి స్పందించిన ఆయన అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి పువ్వాడను కోరగా, ఆ మేరకు చర్యలు తీసుకున్నట్టు పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం వెల్లడించారు.