తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. చార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలి, ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఇంట్లో నివాసముంటున్న వ్యక్తులకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా బయటపడ్డారు. కానీ, చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు ఆ బ్యాటరీ పేలిన శబ్ధానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే..దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇంటి ముందు చార్జింగ్‌లో పెట్టాడు. కొద్దిసేపటికి బైక్ బ్యాటరీ ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ, పేలింది. దాంతో ఇల్లు మొత్తం పూర్తిగా కాలి బూడిదైంది. ప్రమాదంలో లక్ష్మీ నారాయణతోపాటు కుటుంబ సభ్యులకు ఏలాంటి ప్రాణహాని జరగలేదు.
మరోపక్క తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికిల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తుల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలకు ప్రధాన కారణం.. పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో బ్యాటరీకి చార్జీంగ్ పెట్టి, ప్రమాదానికి గురౌతున్నారు.