ఏపీలో ఓ ఏనుగు విధ్వంసం సృష్టించింది. పంట పొలానికి వెళ్లిన తండ్రి,కూతురుపై దాడి చేసింది. ఈ సంఘటనలో యువతి మరణించగా.. ఆమె తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు వస్తున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
కొన్ని రోజులుగా ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో వేరుశనగ పంటను కాపాడుకునేందుకు కాపలాగా మురుగన్ వెళ్లాడు. లాక్డౌన్ వల్ల కాలేజీ లేకపోవడంతో కూతురి సోనియా కూడా అతని వెంట వెళ్లింది. అక్కడి వెళ్లిన తర్వాత ఏనుగు వారిపై దాడి చేసింది. మురుగన్ పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోగా.. సోనియా మాత్రం బలైంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. సమాచారం అందుకున్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.