నాతో సెల్ఫీనా.. చిత్తడి చేస్తా - MicTv.in - Telugu News
mictv telugu

నాతో సెల్ఫీనా.. చిత్తడి చేస్తా

January 19, 2020

Elephant.

అనువుగాని చోట సెల్ఫీలు ప్రమాదకరం అని ఎన్ని హెచ్చరికలు వస్తున్నా ఎవరు వింటున్నారు? పులులతో, ఏనుగులతో సెల్ఫీలు అని ఇప్పటికి చాలామంది తమ ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఫోన్‌తో ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అడవి చూడడానికి వెళ్లిన ఓ టూరిస్ట్ గ్యాంగుకు ఏనుగులు చుక్కలు చూపించాయి. అదృష్టం బాగుండి వాటి బారి నుంచి తప్పించుకున్నారు గానీ, చచ్చి ఊరుకునేవారు. తమిళనాడుకు చెందిన కొంత మంది అభయారణ్యం పర్యటనకు వెళ్లారు. ఇంతలో అక్కడికి ఒక్కసారిగా 50 ఏనుగులు వచ్చాయి. 

వాటిని చూడగానే వారు భయపడటం మానేసి ముచ్చటపడి సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడ్డారు. పోటుగాళ్ల మాదిరి ఫోన్లు తీసుకుని ఓ ఏనుగు వద్దకు వెళ్లారు. సెల్ఫీ ప్రతయ్నం చేస్తున్నారు. పాపం ఆ ఏనుగుకు ఏం తెలుసు వాళ్లు ఉత్త సెల్ఫీనే దిగుతున్నారని? తననేదో చేస్తున్నారని భావించిన ఆ ఏనుగు వారిపై దాడికి యత్నించింది. ఏనుగు కోపాన్ని గ్రహించి వారంతా పరుగులు తీశారు. ఇంతలో ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అతడు లేచి పరిగెత్తబోతుండగా ఏనుగు తన తొండంతో నెట్టింది. ఆ వ్యక్తి కాస్త దూరంలో పడి లేచి మళ్లీ పరిగెత్తాడు. ఏనుగు అతడిని వెంబడించింది. చావు నోట్లో తలపెట్టినంత పనే అయింది అతని పరిస్థితి. ఎలాగోలా ఏనుగు బారి నుంచి తప్పించుకున్నాడు. ఏనుగు దెబ్బకు అందరూ చల్లని చెమట్లు తుడుచుకుంటూ అక్కడినుంచి తిరుగుటపా కట్టారు.