ఏనుగు పగ.. ఆమెను చంపింది, చితిపై నుంచి లాగి తొక్కింది.. - Telugu News - Mic tv
mictv telugu

ఏనుగు పగ.. ఆమెను చంపింది, చితిపై నుంచి లాగి తొక్కింది..

June 13, 2022

ఒడిశాలో ఓ ఏనుగు వింత ప్రవర్తనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియల సమయంలోనూ ఆ ఏనుగు మరోసారి దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇలా వృద్ధురాలిని చంపిన ఘటనలో ఏనుగు వింత ప్రవర్తన అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌పల్‌ గ్రామంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై.. ఆ దగ్గర్లోని పొలాల్లో నుంచి దూసుకొచ్చిన ఓ ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు, స్థానికులు.. మృతదేహాన్ని ఊరేగింపుగా శ్మశాన వాటికకు తరలించారు. మృతదేహాన్ని చితి మీద పెట్టే సమయానికి ఆ ఏనుగు మళ్లీ రావడంతో.. భయంతో అక్కడివారంతా పరుగులు తీశారు. చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి పడేసిన ఏనుగు.. కిందపడేసి తొక్కింది. ఆ వృద్ధురాలి శవాన్ని దూరంగా విసిరేసింది. ఇక, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది..

ఈ ఘటన వెనుక స్థానికులు ఓ స్టోరీని చెబుతున్నారు. వృద్ధురాలి భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడని, విషం పెట్టి ఆవిడే చంపేసిందని ప్రచారం కూడా ఉందట. దీంతో ఆమె భర్తే ఏనుగు రూపంలో ఆమెను చంపేశాడని.. కనీసం అంత్యక్రియలను కూడా సజావుగా సాగకుండా పగతీర్చుకున్నాడని జనాలు చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.