తిండి కోసం  గజరాజు బీభత్సం.. బల్లలు ఎత్తేసి..  - MicTv.in - Telugu News
mictv telugu

తిండి కోసం  గజరాజు బీభత్సం.. బల్లలు ఎత్తేసి.. 

November 30, 2019

మనిషి స్వార్థం పెరుగుతోంది. అడవులు నాశనం అవుతున్నాయి. నీళ్లు అడుగంటిపోతున్నాయి.  తిండి దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. నాగరికత తెలియని మూగజీవులు ఆకలి తీర్చుకోడానికి నానా పాట్లూ పడుతున్నాయి. తిండి కోసం ఓ ఏనుగు ఆర్మీ క్యాంటీన్‌లో దూరి హల్ చల్ చేసింది. బెంగాల్‌లోని హశిమారా  అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన.  

గజరాజు అక్కడి కుర్చీలను, టేబుళ్లను తొండంతో విసిరి కొట్టి హల్‌చల్ చేసింది. క్యాంటీన్ సిబ్బంది అరుస్తుంటే వాళ్లను బెదిరిస్తూ వాళ్ల మీదకు హూంకరించింది. వారిపైకి దూసుకువచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడు వారికి ఓ ఐడియా వచ్చింది. ఆదరాబాదరా కర్రకు బట్ట చుట్టి, దానిమీద కిరోసిన్ పోసి కాగడా మాదిరి నిప్పు అంటించారు. దాంతో దానిని బెదిరించారు. మంటను చూసిన గజరాజు దెబ్బకు తోక ముడిచింది. బాబోయ్ మంట అనుకుని వచ్చిన దారినే బయటకు పరుగులు తీసింది. మంట కర్రతో అలాగే దానిని వెంబడించారు క్యాంటీన్ సిబ్బంది. దీంతో గండం గట్టెక్కినంత పనైంది. క్యాంటీన్‌లో ఎవరైనా ఉండుంటే పెను ప్రమాదమే సంభవించేది. ఏనుగును వెంబడించిన వారు దానిని సమీప అడవిలోకి తరిమేశారు. హసిమారా సమీపంలో అడవి ఉండటంతో గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.