బ్రిటన్ రాణి.. మహమ్మద్ ప్రవక్త వారసురాలు! - MicTv.in - Telugu News
mictv telugu

బ్రిటన్ రాణి.. మహమ్మద్ ప్రవక్త వారసురాలు!

April 7, 2018

చరిత్రే అంత. దాచేస్తే దాగదు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో నిజాన్ని బయటపెడుతుంది. బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ మూలాలపై సంచలన విషయం వెలుగు చూసింది. ఆమె ఇస్లాం మత స్థాపకుడైన మహ్మద్ ప్రవక్త వారసురాలని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. రాణి వంశవృక్షాన్ని అధ్యయనం చేయగా ఈ విషయం బయటిపడిందని పేర్కొంటున్నారు.  అధ్యయనంలో భాగంగా వీరు ఎలిజబెత్ వంశంలో 43 తరాల వ్యక్తుల కుటుంబ వివరాలను శోధించారు. అయితే ఈ సంగతి పాతదేనట. బ్రిటిష్ రాచవంశ మూలాలను పరిశోధించే బుర్కేస్ పీరేజ్ సంస్థ 1986లో ఈ వివరాలను బయటపెట్టింది. అయితే అప్పట్లో పెద్దగా చర్చ జరగలేదు. తాజాగా మొరాకో దినపత్రిక అల్ ఊస్బూ మళ్లీ తిరగదోడింది. తాజా అధ్యయన ఫలితాలను వివరిస్తూ..  ప్రవక్త కుమార్తె ఫాతిమాతో రాణికి నేరుగా రక్తసంబంధం ఉందని పేర్కొంది. మధ్యయుగాలనాటి స్పెయిన్‌లోని జన్యు సంబంధ రికార్డుల్లో ఈ విషయాన్ని రాసిపెట్టారని, మాజీ ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ అలీ గోమా ఇదే విషయాన్ని చెప్పేవారని పేర్కొంది. ప్రవక్త వంశానికి చెందిన జైదా అనే ముస్లిం రాకుమారి 11వ శతాబ్దంలో స్పెయిన్ నుంచి పారిపోయి బ్రిటన్ కు చేరుకుందని, తన పేరును ఇజబెల్లాగా మార్చుకుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇంకా కచ్చితమైన ఆధారాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు.