Elon Musk is losing property
mictv telugu

ఆవిరవుతున్న ఎలాన్ మస్క్ సంపాదన ..రోజుకు 2500 కోట్ల నష్టం

November 22, 2022

Elon Musk is losing property

ట్విట్టర్‌ను ఏ మూహర్తాన ఎలాన్ మస్క్ కొన్నాడోకాని అప్పటినుంచి తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్ కొత్త బాస్‌గా అవతారమెత్తిన వెంటనే ఉద్యోగులపై వేటువేయడం, బ్లూ టిక్స్ కొరకు నగదు వసూలు చేయడం వంటి అంశాలతో గందరగోళం సృష్టించాడు. ఇప్పుడు మస్క్‌కు సంబంధించిన మరోవార్త చర్చనీయాంశమవుతోంది.

ట్విట్టర్ కొనుగోలు చేశాక మస్క్ ఆస్తులు ఆవిరయిపోతున్నాయి. ఏకంగా ఒక సంవత్సరంలో లక్షల కోట్లు కోల్పోయాడు. ఏడాది కిందట 340 బిలియన్ డాలర్లకుపైగా ఉన్న ఆస్తిలో పెద్దం మొత్తం నష్టపోయారని కథనాలు వెలవడ్డాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా మస్క్ కోల్పోయిన సంపద విలువ 100 బిలియన్ డాలర్లు దాటింది. రోజుకు సగటున రూ.2500 కోట్ల చొప్పున సుమారు 9 లక్షల కోట్ల రూపాయలకుపైగా నష్టపోయారు. ప్రస్తుతం మస్క్ సంపద 340 బిలియన్ డాలర్ల నుంచి.. 170 బిలియన్ డాలర్లకు చేరింది. మస్క్ తన సంపాదలో 37 శాతం నష్టపోయినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వివరించింది. తన ఇతర కంపెనీలు టెస్లా, స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనీలకు నష్టాలే ఎదురవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెస్లా షేరు ఏకంగా 50 శాతానికిపైగా పడిపోయింది.

ట్విట్టర్ కొనుగోలు కోసం ఏకంగా మస్క్ 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. అప్పటి నుంచి ట్విట్టర్‌లో భారీ మార్పులు తీసుకొస్తున్నారు. మస్క్ రాక ముందు ట్విట్టర్ లో మొత్తం 7,500 మందికి పైనే పనిచేస్తుంటే.. ప్రస్తుతం వారి సంఖ్య 2,750కు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. కొంత మందిని నేరుగా తీసేయగా.. కొంత మంది వారంతట వారే సంస్థ నుంచి వెళ్లిపోయారు.