Elon Musk net worth less than $200 billion
mictv telugu

ట్విట్టర్‌ కొనుగోలుతో భారీగా కరిగిన మస్క్ ఆస్తులు

November 9, 2022

Elon Musk net worth less than $200 billion

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుతో భారీగా నష్టపోయారు. 44 బిలియన్ డాలర్లకు ఆ సంస్థను కొనుగోలు చేయగా, అందుకోసం నిధులు సమకూర్చుకోవడానికి టెస్లాలో ఉన్న షేర్లను విక్రయించాడు. నవంబర్ 4 నుంచి 8 మధ్య 19.5 మిలియన్ల షేర్లను విక్రయించినట్టు రెగ్యులేటరీ ఫైలింగులో మంగళవారం తెలిపాడు.

గత ఆగస్టులో 7 బిలియన్ డాలర్ల విలువ చేసే టెస్లా షేర్లను విక్రయించాడు. దీంతో టెస్లాలో తనకున్న వాటా 15 శాతం నుంచి ఇంకా దిగువకు తగ్గిపోనుంది. అటు మస్క్ షేర్లను విక్రయించడంతో టెస్లా విలువ కూడా తగ్గిపోయింది. ఈ ఏడాది దాదాపు 52 శాతం విలువను ఆ కంపెనీ కోల్పోయింది. మస్క్ వాటాల విక్రయింతో పాటు మార్కెట్లో ఈవీలు అందించే సంస్థల నుంచి పోటీ పెరగడంతో ఈ విలువ తగ్గిపోయిందనీ, ఇన్వెస్టర్లు కూడా మస్క్ నుంచి దూరం జరిగే దారులు వెతుక్కుంటున్నారని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ ప్రభావంతో మస్క్ సంపద నికర విలువ తొలిసారిగా 200 బిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరిందని, అయినా ప్రపంచ కుబేరుడు స్థానానికి ఢోకా లేదని వివరిస్తున్నారు. దీనంతటికీ కారణం ట్విట్టర్ పిట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్‌ గత యాజమాన్యానికి చెల్లించాల్సిన 44 బిలియన్ డాలర్లలో మస్క్ సొంతంగా 15.5 బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ఒప్పందంలో రాసి ఇచ్చాడు. మిగతా సొమ్మను ఈక్విటీ ఇన్వెస్టర్లు అందించడానికి ముందుకు వచ్చారు. అయితే వారిలో ఎవరైనా తప్పుకుంటే ఆ భారం మస్క్ పైనే పడుతుంది. ఇదే కనుక జరిగితే మరిన్ని టెస్లా షేర్లు విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. కాగా, మంగళవారం టెస్లా షేరు 2.9 శాతం పతనమై 191.30 డాలర్ల వద్ద స్థిరపడింది.