రోజుకు 12 గంటల పని, వీక్లీ ఆఫ్ లేదు..
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు ఏమో అయింది. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ట్విటర్ కొనుగోలు చేశాక మరింత అతి చేస్తున్నాడు. ట్విటర్ ఓ మురికి గుంటగా మారిపోతుందని వాస్ బేసిన్ తీసుకెళ్లి హల్ చేసిన మహానుభావుడు తాజాగా నియంతలు కూడా చేయనంత పని చేశాడు! ట్విటర్ ఉద్యోగులు ఇకపై రోజుకు 12 గంటలు పనిచేయాలని, వీక్లీఆఫ్ కూడా ఉండదని హుకుం జారీచేసినట్లు వార్తలు వస్తున్నాయి. రోజుకు 12 గంటలు, వారంలో ఏడురోజులూ పనిచేస్తే మటాష్ అయిపోతామని ‘పిట్ట’ ఉద్యోగులు భయంకరంగా తింటుకుంటున్నారు.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రోజుకు 12 గంటల పని చేసేవాళ్లు మాత్రమే కంపెనీలో ఉండాలని, ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేసి వెళ్లిపోవాలని మస్క్ ఆదేశాలు జారీ చేశాడు. ఉద్యోగులకే కాదు, మేనేజర్లకు, చోటామోటా బాస్ లకూ ఇదే రూల్. నవంబర్ మొదటి వారానికాల్లా ఈ రూల్ తప్పనిసరిగా అమలు కావాలని, ఈ విషయంలో చర్చలేం ఉండవని మస్క్ తేల్చినట్లు సీఎన్బీసీ వార్తాసంస్థ సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ చెప్పింది. ఉద్యోగుల్లో 50 శాతం మందిని తప్పించే దిశగా మస్క్ ఇలాంటి నిర్ణయాలు మరికొన్ని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. కాగా, బ్లూటిక్ మార్క్ కోరే యూజర్ల నుంచి పైసలు వసూలు చేయాలని మస్క్ మామ నిర్ణయించడం తెలిసిందే. కంపెనీ పైస్థాయి అధికారుల్లో తనకు ఇష్టం లేనివారిని తరిమేసి, తన అడుగులకు మడుగులు ఒత్తేవారికి ఆయన పెద్దపీట వేస్తున్నాడు.