Elon Musk says he is buying Twitter to help humanity, appeals to advertisers
mictv telugu

ట్విటర్‌ను మానవత్వంతోనే కొంటున్నా.. 3.6 లక్షల కోట్లకు

October 27, 2022

థ్రిల్లింగ్ కామెడీగా మారిన ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఎట్టకేలకు రేపటికి పూర్తికానుంది. ట్విటర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ అధిపతి ఎలన్ మస్క్ జోకులు పేలుస్తూ తెగ హుషారుగా ఉన్నాడు. 44 బిలియన్ డాలర్లకు(రూ. 3.60 లక్షల కోట్లు)కు ట్విటర్ మైక్రోబ్లాగింగ్ సైటును కొంటున్న ఆయన తాను మానవత్వంతోనే ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. ‘ట్విటర్ మానవ నాగరికతలో మైలురాయి.

అందుకే మానవత్వంతో కొంటున్నాను. వ్యాపార ప్రకటనలు ఇచ్చేవారు సహకరించాలి. ట్విటర్ భిన్నాభిప్రాయాల వేదిక. నేను కొన్నాక అది నానా చెత్త కాలువగా మారి, అతివాద భావాలకు నియలం కావొచ్చు. ప్రకటనలు ఇచ్చేవారు ముందుకు రాకపోవచ్చు. అందుకే వారు అవి పట్టించుకోకుండా పెద్దమనసుతో ముందుకు రావాలి. నేను పైసల కోసం దీన్ని కొనడం లేదు. నేను ప్రేమించే మానవాళి కోసం కొంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

మస్క్ కొంటే ట్విటర్ ఉద్యోగుల్లో 75 శాతం మందికి ఇంటికి పంపేస్తారని వార్తలు రావడం, అలాంటిదేం ఉండదని ఆయన చెప్పడం తెలిసిందే. ట్విటర్‌ను కొంటానని మొదట చెప్పి, తర్వాత కొనబోవడం లేదని మస్క్ కలకలం రేపడం తెలిసిందే. కోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చిన మస్క్ శుక్రవారానికల్లా ప్రక్రియ ముగిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ఆఫీసుకు వెళ్లి హల్ చల్ చేశారు. వాష్‌బేషిన్ పట్టుకుని లోనికి వెళ్లిన ఆయన ‘‘కాసేపు ఆగండి, నేను ఏం చెబుతున్నానో ఆలోచించండి’ అని ఆ వీడియోనుపంచుకున్నారు. ట్విటర్ ను కొనడానికి ఆయన బడా కంపెనీల నుంచి అప్పులు తీసుకుంటున్నారు.