ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నాక ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ఊహకందని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అటు ఎంప్లాయిస్ను ఇటు యూజర్లను తికమక పెడుతున్నాడు. మస్క్ నిర్ణయాలపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తమవుతుంది. సంస్థలో ఉద్యోగాలను తొలగించి షాక్ ఇచ్చిన మస్క్..బ్లూ టిక్ యూజర్లు డబ్బులు చెల్లించాలని రూల్ పెట్టాడు. ట్విట్టర్ యూజర్లతో సహా, అన్ని వైపుల నుండి మస్క్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. దీంతో తాను ట్విట్టర్ సీఈవో ఉండాలా ? వద్దా ? అని తనకు తానే ఆదివారం పోల్ నిర్వహించుకున్నాడు. ఎక్కవ మంది ఏది చెబితే అది చేస్తానని ప్రకటించాడు. మొత్తం 24 గంటల పాటు కొనసాగిన ఈ పోల్‌లో 57.5 శాతం మంది యూజర్లు మస్క్ ను సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఓటేశారు. మిగతా 42.5 శాతం మస్క్ కొనసాగాలని కోరారు.
పోల్‌లో ఎక్కువమంది యూజర్లు తనను తప్పుకోవాలని సూచించడంతో మస్క్ మాట్లాడారు. త్వరలో సీఈవో బాధ్యతలనుంచి తప్పుకుంటానని చెప్పాడు. అయితే తన స్థానంలో ఓ ఫూలిష్ పర్సన్ రాగానే సీఈవో పోస్టుకు రాజీనామా చేస్తానని తెలిపారు. అనంతరం సాఫ్ట్ వేర్, సర్వర్ టీమ్ బాధ్యతలు చూసుకుంటానని మస్క్ వివరించారు. ట్విట్టర్ సీఈవోగా మస్క్ తప్పుకోవాలనే దానిపై కొన్ని వారాలుగా చర్చ జరుగుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. . సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ టెస్లా కంపెనీ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారని మస్క్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తన కథనంలో వెల్లడించింది. మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేశాక అతని ఆస్తి మంచులా కరిగిపోతూ వస్తుంది. ప్రపంచంలోనే ధనవంతుల్లో నెం.1 స్థానంలో ఉన్న అతడు రెండవ స్థానానికి పడిపోయాడు.