'ఇలా చేస్తే మీరూ బాగా డ‌బ్బు సంపాదిస్తారు'.. ఎలాన్ మ‌స్క్ ట్వీట్ వైర‌ల్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఇలా చేస్తే మీరూ బాగా డ‌బ్బు సంపాదిస్తారు’.. ఎలాన్ మ‌స్క్ ట్వీట్ వైర‌ల్

May 2, 2022

తాను చెప్పిన‌ట్లు చేస్తే డ‌బ్బు సంపాదించండం చాలా తేలిక అంటున్నారు టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఇటీవల 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను చేజిక్కించుకుని ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మ‌స్క్.. తాజాగా ట్విట‌ర్‌లో వ్యాపారానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి త‌మ సంపద ఎలా పెంచుకోవాలని అడిగే నెటిజ‌న్ల‌ ప్రశ్నకు ఆయన అద్భుత‌మైన స‌ల‌హానిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ” వాటాలను ఎప్పుడు అమ్మాలి? ఎప్పుడు కొనాలి? నన్ను చాలా మంది అడిగారు. ఏ సంస్థ ఉత్పత్తులు, సేవలపై మనకు నమ్మకం ఉంటుందో ఆ సంస్థ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీ ఉత్పత్తుల పనితీరు సరిగా లేదని భావించిన సందర్భంలో మరో ఆలోచన లేకుండా మన వద్ద ఉన్న షేర్లను వెంటనే అమ్మేయాలి. మార్కెట్ ఒడిదుడుకుల‌కు లోనైనప్పుడు మీరు కూడా దాంతోపాటే భయాందోళనలకు గురికాకుండా తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి. ఈ సలహాలను పాటించిన వారికి దీర్ఘకాలంలో మంచి లాభాలు కళ్లచూస్తారన్నారు.” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా… ట్విటర్‌ను లాభాల బాట పట్టిస్తానన్న మస్క్.. తదుపరి ఏం చేస్తారోననే సందేహం ట్విటర్‌ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయా లేదా అంటూ కొందరు ఏకంగా సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అంతర్గత మీటింగ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే.. ట్విటర్ ఉద్యోగుల పట్ల సంస్థ యాజమాన్యం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుందని పరాగ్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట.