ఉక్రెయిన్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా బలగాలు చుట్టుముట్టిన వేళ ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. నెల రోజుల పాటు దేశమంతా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అవసరమైతే మార్షల్ చట్టం ప్రయోగిస్తామని ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా బుధవారం ట్వీట్లో వెల్లడించారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించాలని నిర్ణయించారు. రష్యా యుద్దం చేసే అవకాశం ఉండడంతో రిజర్వ్ బలగాలను కూడా యాక్టివ్ చేశారు.
అంతేకాకుండా 18 నుంచి 60 ఏళ్ల వయస్సున వాళ్లు సైన్యంలో చేరాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. రష్యా దాడికి భయపడేది లేదని, ఎదురుదాడి చేస్తామన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు రెండు రష్యా బ్యాంకులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయిన కూడా ఆ ఆంక్షలకు భయపడేది లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత దూకుడు పెంచారు. ఆ దూకుడు నుంచి నిరోధించడానికి మరిన్ని ఆంక్షలు అవసరమని విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా పేర్కొన్నారు.