నటి దీపికా పదుకొణే ఆదుకోవట్లేదంటూ ఉద్యోగుల మండిపాటు - MicTv.in - Telugu News
mictv telugu

నటి దీపికా పదుకొణే ఆదుకోవట్లేదంటూ ఉద్యోగుల మండిపాటు

May 31, 2022

బాలీవుడ్ నటి దీపికా పదుకొణే తమను ఆదుకోవాలంటూ అన్ అకాడమీ సంస్థ ఉద్యోగులు ఆమెను డిమాండ్ చేస్తున్నారు. సడెన్‌గా ఉద్యోగాల నుంచి తమను తీసివేయడంతో తాము, తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. బెంగళూరు కేంద్రంగా 2015లో ముగ్గురు వ్యక్తులు కలిసి అన్ అకాడమీ పేరుతో ఓ ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రారంభించారు. అప్పటికే ఆ రంగంలో దూసుకెళ్తున్న బైజూస్ సంస్థకు ధీటుగా అన్ అకాడమీ తన కార్యకలాపాలను సాగించింది. కానీ ఆ తర్వాత పోటీలో నిలదొక్కుకోలేక వరుస నష్టాలను చవిచూసింది. వాటి నుంచి బయటపడేందుకు గత నెలలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. మిగిలిన వారు తమతో ఎక్కువ పనిగంటలు చేయిస్తూ వెట్టి చాకిరీకి గురి చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఇదిలా కొనసాగుతుండగానే ఆ సంస్థ మరో 150 మందిని తొలగించింది. దీంతో ముందస్తు నోటీసులు లేకుండా ఎలా తొలగిస్తారని మాజీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంస్థలో ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నటి దీపికా పదుకొణే ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడిన ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించడం సమంజసం కాదని, ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.