ఉద్యోగులు ఆఫీసులో నిద్రపోతే జీతమిస్తాం : బెంగళూరు కంపెనీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులు ఆఫీసులో నిద్రపోతే జీతమిస్తాం : బెంగళూరు కంపెనీ

May 6, 2022

పనివేళల్లో ఆఫీసులో ఎవరైనా నిద్రపోతే సాధారణంగా ఏం చేస్తారు? క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు లేదా మరో రకంగా శిక్షిస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులు నిద్రపోతే ఎలాంటి చర్యలు తీసుకోకుండా పూర్తి జీతం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగుల మెయిల్ ఐడీలకు మెసేజ్ పెట్టింది. దీంతో షాకవడం ఉద్యోగుల వంతైంది. వివరాలు.. పరుపులు, సోఫాలు తయారీ వ్యాపారం చేస్తున్న స్టార్టప్ కంపెనీ అయిన వేక్‌ఫిట్ అనే కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అరగంట పాటు నిద్రపోవడానికి అధికారికంగా అనుమతులిచ్చింది. దీంతో ఒత్తిడి తగ్గి, శ్రద్ధ పెరిగి ఉత్పత్తి నాణ్యత పెరుగుతుందని వారి నమ్మకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం 2 నుంచి రెండున్నర గంటల వరకు అధికారిక న్యాప్ టైం అవర్‌ను ప్రకటించింది. ఇక నుంచి నిద్రపోయే హక్కును ఉద్యోగులకు కల్పించారు. అందుకు తగినట్టుగా వర్కింగ్ క్యాలెండర్‌లో మార్పులు చేశారు. ఉద్యోగులు నిద్రపోయేందుకు ప్రత్యేక గదులతో పాటు న్యాప్ ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేశారు.