టీఆర్ఎస్ నేతలను ఖతం చేస్తాం.. మావోయిస్టు పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ నేతలను ఖతం చేస్తాం.. మావోయిస్టు పార్టీ

March 3, 2018

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గట్టి ఎదురుదెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. టీఆర్ఎస్ నాయకులను ఖతం చేస్తామని మావోయిస్టు పార్టీ శనివారం హెచ్చరించింది. ఇకపై… మేం టీఆర్ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తామంది. ‘హిందుత్వ నాయకుడు రమణ్‌సింగ్, నియంత కేసీఆర్‌లు కలిసికట్టుగా ఆదివాసీలపై, ప్రశ్నించే వారిని నిర్మూలించేందుకు దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు..’ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.కార్పొరేట్లకు వనరులు దోచిపెట్టడానికి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిర్మూలించుందకు దాడులు చేస్తున్నారని, ప్రజల సాయంతో వీటిని తిప్పికొడతామని పేర్కొన్నారు. ‘నీళ్లు, భూమిని కార్పొరేట్ శక్తులు దారాదత్తం చేసేందుకే నియంత  కేసీఆర్ ఈ విధమైన బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారు.. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముఖ్యనాయకులు చనిపోయారని ప్రచారం చేసి, అయోమం సృష్టించి ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అగ్రనాయకులెవరూ చనిపోలేదు. హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి సురక్షితంగానే ఉన్నారు. మృతుల్లో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. మిగతా వారంతా దంతెవాడకు చెందిన వారని తెలిపారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ముందురోజు రాత్రే పోలీసు బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులు కాలకృత్యాలు తీర్చుకుంటుండగా కాల్పులు కాల్పులు జరిపారని జగన్ తెలిపారు.